నాడు నేడు..అనంత అభివృద్ధి
మనస్సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కృషితో అనంతపురం నగరంలో మూడున్నరేళ్ల వైసిపి పాలనలో శర వేగంగా అభివృద్ధి జరుగుతోందని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో నగరపాలక సంస్థ పాలకవర్గం రెండేళ్ల పాలనలో నగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. నగర మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయ భాస్కర్ రెడ్డి, ఇన్చార్జి కమిషనర్ రమణారెడ్డి లతో కలిసి ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. నగరంలోని 50 డివిజన్ ల పరిధిలో పనులు చేయకముందు, పనులు చేసిన తర్వాత ఆయా ప్రాంతాలలోని పరిస్థితులను వివరిస్తూ నాడు- నేడు పరిస్థితుల ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయా డివిజన్ లలో పనుల పురోగతి జరిగిన అభివృద్ధి పనుల వివరాలను అధికారులు మేయర్ కు వివరించారు.
ఈ సందర్భంగా మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ గతంలో పనులు శిలాఫలకానికి పరిమితం అయ్యేవన్నారు. నేడు అందుకు భిన్నంగా పనులను తమ ప్రభుత్వం ప్రారంభించి పూర్తి కూడా తమ ప్రభుత్వ హయాంలోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కృషితో నేడు నగరంలో రూ.800 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను చెప్పట్టడం జరుగుతోందన్నారు.50 డివిజన్ల పరిధిలోను ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారులు, రోడ్లు డ్రైనేజీలు అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతోందన్నారు. నగర ప్రజల సహకారంతోనే వేగవంతంగా పనులు పూర్తి చేయడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.