విద్యుత్‌శాఖ ఎస్‌ఈగా సంపత్‌కుమార్ బాధ్యతల స్వీకరణ
మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి : విద్యుత్ శాఖ ఉమ్మడి అనంతపురం జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ)గా ఎట్టకేలకు కె.సంపత్‌కుమార్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా తిరుపతి కార్పొరేట్ ఆఫీస్‌లో పని చేస్తున్న సంతప్‌కుమార్‌కు ఎస్‌ఈగా పదోన్నతి కల్పిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లా ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈగా నియమించారు. ఈ మేరకు రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే. శనివారం ఉదయమే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని తెలిసి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు విద్యుత్‌శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే సాంకేతిక సమస్య కారణంగా బాధ్యతల స్వీకరణ విషయంలో కాస్త గందరగోళం ఏర్పడిరది. చివరకు ఆదివారం మధ్యాహ్నం ఆయన ఎస్‌ఈగా బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా కాలం పాటు పని చేసిన సంపత్‌కుమార్‌కు మంచిపేరు ఉంది. అందరితో స్నేహపూర్వకంగా ఉండడం.. పని చేసిన ప్రతి చోటా కింది స్థాయి సిబ్బందితోనూ ఎలాంటి వివాదాలు లేకుండా ఉండడం ఆయన పనితీరుకు నిదర్శనం. సంపత్‌కుమార్ బాధ్యతలు స్వీకరించాక పెద్ద ఎత్తున ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. డిప్యూటీ ఈఈలు శ్రీనివాసులు, వివేకానంద స్వామి, రామకృష్ణ, ఏఏఓ గంగన్న, ఫోర్‌మన్ గోపాల్ తదితరులు ఎస్‌ఈ సంపత్‌కు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఇదిలా ఉండగా గతంలో సంపత్‌కుమార్ కదిరి ఏఈ, ఏడీఈగా సుమారు 17 ఏళ్లు పని చేశారు. ఆ తర్వాత గుంతకల్లు, హిందూపురం ఏడీఈగా పని చేశారు. ఆ తర్వాత అనంతపురం ఆపరేషన్స్, ట్రాన్స్‌ఫార్మర్స్ డీఈగా పని చేసిన అనుభవం ఉంది. ప్రజలు, రైతాంగానికి మెరుగైన సేవలను అందించమే తన లక్ష్యమని ఎస్‌ఈ సంపత్ తెలియజేశారు.