ఎంట్రీ పాస్ ఉంటేనే మద్యం లాటరీకి అనుమతి
మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి : అదృష్ట లక్ష్మి లాటరీ రూపంలో తలుపు తట్టే రోజు రానే వచ్చింది..! ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటు కోసం సోమవారం ఓపెన్ లాటరీ నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి జేఎన్‌టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో, శ్రీసత్యసాయి జిల్లాకు సంబంధించి పుట్టపర్తిలోని సాయి ఆరామంలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లకు అధికార యంత్రాంగం పూర్తి చేసింది. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసే సమయంలో జనరేట్ అయిన ఎంట్రీ పాస్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉంటేనే ఓపెన్ లాటరీ ప్రాంగణంలోకి దరఖాస్తుదారులను అనుమతించనున్నారు. అనంతపురం జిల్లాలో 136 మద్యం దుకాణాల ఏర్పాటుకు 3265 దరఖాస్తులు అందాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో 87 షాప్‌ల కోసం 1518 మంది దరఖాస్తు చేశారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 30 దుకాణాల కోసం 1159 మంది దరఖాస్తు చేశారు. అత్యల్పంగా తాడిపత్రి నియోజకవర్గంలో 20 దుకాణాలకు 106, రాప్తాడు నియోజకవర్గంలో 13 దుకాణాల ఏర్పాటుకు 106 మంది దరఖాస్తు చేశారు. ఉవరకొండ నియోజకవర్గంలో 13 దుకాణాలకు 413 దరఖాస్తులు, శింగనమలలో 18 షాపులకు 605,గుంతకల్లు నియోజకవర్గంలో 23 దుకాణాలకు 374, రాయదుర్గం నియోజకవర్గంలో 14 షాపులకు 377,కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 10 దుకాణాలకు 154, ధర్మవరం నియోకజవర్గంలో 20 షాపులకు 219, పెనుకొండ నియోజకవర్గంలో 15 దుకాణాల ఏర్పాటుకు 338, పుట్టపర్తి నియోజకవర్గంలో 13 షాపుల కోసం 424, హిందూపురం నియోజకవర్గంలో 9 దుకాణాలకు 185, కదిరి నియోజకవర్గంలో 15 దుకాణాలకు 161, మడకశిర నియోజకవర్గంలో 10 మద్యం షాపుల కోసం 162 మంది దరఖాస్తు చేశారు. మొత్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 223 దుకాణాలకు 4783 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 223 మద్యం దుకాణాల ద్వారా ఇప్పటికే దరఖాస్తు ఫీజు రూపంలో ప్రభుత్వానికి రూ.95 కోట్ల 66 లక్షలు సమకూరింది.
పారదర్శకంగా ఓపెన్ లాటరీ
పారదర్శకంగా మద్యం టెండర్లకు సంబంధించి ఓపెన్ లాటరీ నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. ఆదివారం జేఎన్టీయూ ఆడిటోరియంలో మద్యం టెండర్ల కోసం అవసరమైన ఏర్పాట్లను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామ్మోహన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. సోమవారం ఉదయం 7 గంటలకు ఓపెన్ లాటరీ ప్రక్రియ మొదలవుతుందని, ఇందుకోసం రెండు కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని శివ్ నారాయణ్‌శర్మ తెలిపారు. దరఖాస్తుదారుడికి ఎంట్రీ పాసులు ఇవ్వడం జరుగుతుందని, వారిని మాత్రమే అనుమతిస్తామన్నారు.