బాబూ.. సంపద సృష్టి ఇదేనా?
-
ఎక్కడికక్కడ ఇసుక దోపిడీ చేస్తున్న ప్రజాప్రతినిధులు
-
కలెక్టర్, ఎస్పీలకు అక్రమ రవాణా కన్పించడం లేదా?
-
నాలుగు నెలలుగా భవన నిర్మాణ రంగం నిర్వీర్యం
-
ఇసుక దోపిడీలో అధికార యంత్రాంగం భాగస్వామ్యం
-
జిల్లా అంతటికీ ఒక స్టాక్ పాయింట్ పెట్టడం ఏంటి?
-
మద్యం పాలసీతోనూ టీడీపీ నేతలకే లబ్ధి
-
దరఖాస్తుదారులను బెదిరిస్తున్న పరిస్థితి
-
ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నా పట్టించుకోరా?
-
చంద్రబాబు, లోకేష్‌కు ఏమైనా వాటాలు అందుతున్నాయా?
-
ఎవర్నీ కంట్రోల్ చేయలేని పరిస్థితిలో సీఎం చంద్రబాబు
-
ప్రతి గ్రామంలో బెల్టు షాపుల ఏర్పాటుకు రంగం సిద్ధం
-
వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఫైర్
మనస్సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. ఉన్న సంపదను టీడీపీ నేతలకు కట్టబెడుతున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఇసుక దోపిడీ జరుగుతున్నా, మద్యం పాలసీలో ప్రభుత్వానికి ఆదాయం గండిపడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్‌కు ఇందులో వాటాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మంగళవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోంది. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్‌తో పాటు ఉచితంగా ఇసుక అందిస్తామని చెప్పారు. నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామన్నారు. సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామని ఊదరగొట్టారు. కానీ ఈ రోజు ఏం జరుగుతోందో ప్రజలు ఆలోచించాలి. భవన నిర్మాణ రంగంపై రాష్ట్రంలో 60 లక్షల మంది ఆధారపడ్డారు. కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల నాలుగు నెలల్లో నిర్మాణ రంగం కుదేలైంది. ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉండేది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి రోజు నుంచే ఇసుకను దోపిడీ చేశారు. రాష్ట్రంలో సంపద సృష్టించడం దేవుడెరుగు.. ఉన్న సంపదను అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నారు. వారికి మాత్రమే సంపద సృష్టించారు. జిల్లాలో ఇసుకను ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నా నియంత్రించలేని పరిస్థితి ఉంది. నిత్యం ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లోనే ఇసుక తరలిపోతోంది. చంద్రబాబు గానీ, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న లోకేష్‌కు గానీ ఇసుక దోపిడీ కనిపించడం లేదా? ప్రముఖ పత్రికల్లోనూ పతాక శీర్షికల్లో ఇసుక దోపిడీపై కథనాలు వస్తున్నాయి. అనంతపురం జిల్లాలో నదీపరివాహక ప్రాంతాల్లోని ఇసుకనంతా తోడేస్తున్నారు. పెద్ద ఎత్తున టిప్పర్లతో ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఉచిత ఇసుక అభాసుపాలైందని సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్టేట్‌మెంట్ ఇచ్చారు. మీకు తెలియకుండానే ఇసుక తరలిపోతోందా? పెన్నా, చిత్రావతి, వేదవతి హగరి, కుషావతి, పాపాగ్ని నదీపరివాహ ప్రాంతాల్లో ఇసుక దోపిడీ జరుగుతోంది. ప్రతి గ్రామం వద్ద జేసీబీలు, ఇటాచీలు పెట్టుకుని నిత్యం వందల సంఖ్యలో తరలిస్తుంటే అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహిస్తోంది. స్టేట్‌మెంట్లకు మాత్రమే నేనూ, మీరే పరిమితం కావాలని కలెక్టర్, ఎస్పీలకు సీఎం చంద్రబాబు చెప్పారా? మీకు చేతకాకుంటే నా వద్దకు వస్తే.. ఎక్కడి నుంచి ఇసుక తరలిపోతోందో చెబుతా..! రాయదుర్గం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు, రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే దోపిడీ జరుగుతోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఇసుక ద్వారా ఆదాయం వచ్చేది. కానీ నేడు ఆ పరిస్థితి కూడా లేదు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పారు. గతంలో రూ.15 వేలకు దొరికే ఇసుక ఈ రోజు రూ.22 వేలకు వస్తున్న పరిస్థితి. ఎప్పుడైనా పత్రికల్లో కథనాలు వస్తే ఎద్దుల బండ్లను మాత్రమే పట్టుకుని స్టేషన్లలో పెడుతున్నారు. టిప్పర్లు కనిపించడం లేదా? ఇసుక దోపిడీ వ్యవహారంలో పోలీసులు, రెవన్యూ అధికారులు భాగస్వామ్యం అయ్యారు. స్టేషన్‌కు ఇంత అని వ్యాపారం చేస్తున్నారు. జిల్లాలో ఇంతలా జరుగుతున్న ఇసుక దోపిడీ గురించి సీఎం చంద్రబాబుకు తెలియదా? చివరకు ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా బెదిరించే పరిస్థితికి వచ్చారు. మేం గెలవకపోతే మీరు ముఖ్యమంత్రి అయ్యేవారా? అని చెప్పే పరిస్థితి వచ్చింది. టీడీపీ ప్రజాప్రతినిధులు ఇసుక దోపిడీ చేస్తూ ఛాలెంజ్‌లు విసురుతున్నా కిమ్మకున్నారు. దీనికి కారణం ఏంటి? మీకు చేతకావడం లేదా? ఎమ్మెల్యేలు మీ కంట్రోల్‌లో లేరా? మీకూ వాళ్లకు ఏమైనా అగ్రిమెంట్ ఉందా? ప్రతి టిప్పర్ నుంచి పర్సంటేజీ ఏమైనా తండ్రీకొడుకులకు వస్తోందా? అని అడుగుతున్నా. జిల్లా సరిహద్దులోని కడప జిల్లా ఏటూరు నుంచి అనంతపురం జిల్లా కేంద్రానికి నిత్యం టిప్పర్లలో ఇసుక వస్తోంది. సుమారు రూ.24 వేల నుంచి రూ.27 వేల వరకు విక్రయిస్తున్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధులను నియంత్రించలేని పరిస్థితి నెలకొంది.
మద్యం పాలసీలో ఏం జరుగుతోందో తెలుసా?
మద్యం పాలసీలో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని ఓటు వేసిన మేథావులను సైతం ఆశ్చర్యపరిచేలా ప్రతి ఎమ్మెల్యే బెదిరింపులకు దిగుతున్నారు. దరఖాస్తు చేసుకుంటే వ్యాపారాలు చేసుకోలేరని అంటున్నారు. ఏకంగా సీఐలు, డీఎస్పీలే ఫోన్లు చేస్తున్నారు. మద్యం షాపులకు డీడీలు కట్టి వేసుకుంటే మంచిది కాదని, స్టేషన్లకు రావాలని పిలుపులు వస్తున్నాయి. 2019 కన్నా ముందు కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా వచ్చి మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉండేది. కానీ ఇప్పడా పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది డీడీలు కడతారనుకుంటే ఇప్పటి వరకు 50 వేల మంది కూడా వేయలేదు. అందరూ కలిసి సిండికేట్‌గా మారారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎస్పీ, కలెక్టర్లు ప్రభుత్వానికి చెప్పడం లేదా? రాష్ట్రాన్ని దోపిడీ చేయాలని అనుకుంటున్నారా? ఇదేనా చంద్రబాబు అనుభవం? ఇదెక్కడి సంస్కృతి. ఎవర్నీ కంట్రోల్ చేయలేరా? కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇతరులు వ్యాపారాలు, కాంట్రాక్టర్లు కూడా చేసుకోలేని పరిస్థితి. పరిస్థితి ఇలాగే ఉంటే వైసీపీనే ప్రజల పక్షాన నిలబడాల్సి వస్తుంది. ఎస్పీ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు మద్యం, ఇసుక విషయంలో నిష్పక్షపాతంగా ఉండండి. కేవలం ప్రకటనలకు పరిమితం కావద్దు. సిండికేట్ వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడడమే కాకుండా కొంత మంది ప్రజాప్రతినిధుల చేతుల్లోకి అక్రమ సంపాదన చేరుతోంది. ఇసుకకు సంబంధించి జిల్లా అంతా ఒక స్టాక్ పాయింట్ పెట్టడం ఏంటి? వాస్తవానికి ఇసుక కొరతను ప్రజాప్రతినిధులే సృష్టిస్తూ ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించేస్తున్నారు. గతంలో ఇసుక అక్రమ తవ్వాకాలు జరుగుతున్నాయని కొందరు ఎన్జీటీకి వెళ్లారు. ఇప్పుడు అదే ప్రాంతంలో ఇసుక దోపిడీ జరుగుతోంది. జిల్లాలో ప్రజాప్రతినిధులు ఎంతగా బరితెగుస్తున్నారంటే.. చివరకు మద్యం షాపుల వద్ద అమ్ముకునే తినుబండారాల విషయంలో కూడా గుత్తాధిపత్యం ఇస్తామంటున్న పరిస్థితి. ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉందా? బెల్టు షాపుల ఏర్పాటుకూ రంగం సిద్ధమవుతోంది.