పరిటాల శ్రీరాంకు లైన్‌ క్లియర్‌..!

ఆశీర్వదించాలని కోరిన నారా లోకేష్‌

On
పరిటాల శ్రీరాంకు లైన్‌ క్లియర్‌..!

మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో దారుణ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో క్యాడర్‌ కూడా పని చేస్తోంది. అటు అధినేత చంద్రబాబు.. ఇటు యువనేత నారా లోకేష్‌ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ బలాన్ని పెంచాలని లోకేష్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలోలా ఎన్నికలకు ముందు అభ్యర్థులను ప్రకటించకుండా.. ముందు నుంచే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో పొత్తు రాజకీయాలు ఉంటాయన్న ఊహాగానాలు ఓ వైపు ఉండగానే నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో పలుచోట్ల అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యువగళం పాదయాత్ర ముగియగా ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వరకు ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే అక్కడ అభ్యర్థులను నారా లోకేష్‌ ఫిక్స్‌ చేస్తున్నారు. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతోనే జరుగుతున్నట్లు ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‌, పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి పోటీ చేయడం ఖాయమైంది. సత్యవేడులో హెలెన్‌, నగరిలో భాను ప్రకాష్‌, చంద్రగిరిలో పులివర్తి నాని, పీలేరులో నల్లారి కిశోష్‌కుమార్‌రెడ్డిలను గెలిపించాలని నారా లోకేష్‌ సూచనప్రాయంగా క్యాడర్‌కు సూచించారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే కదిరి, పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర ముగిసింది. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగుతుండగా..రాప్తాడు నియోజకవర్గంలోకి లోకేష్‌ మరోసారి సోమవారం అడుగుపెట్టనున్నారు.

WhatsApp Image 2023-04-02 at 7.00.09 PM

కదిరి, పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరిన నారా లోకేష్‌.. ధర్మవరం నియోజకవర్గంలో మాత్రం భిన్నంగా ప్రసంగం కొనసాగించారు. ఆదివారం బత్తలపల్లిలో జరిగిన సభలో లోకేష్‌ ప్రసంగాన్ని నిశితంగా గమనిస్తే టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరాం పేరును దాదాపు ఖరారు చేసినట్లు స్పష్టమవుతోంది. తన ప్రసంగంలో పరిటాల శ్రీరాంను ప్రజలు, క్యాడర్‌కు చూపిస్తూ నారా లోకేష్‌ ఏమన్నారంటే.. ‘‘ఒక యువకుడున్నాడిక్కడ.. ఉత్సాహవంతుడున్నాడు.. కష్టపడే మనస్తత్వం ఉంది. నా పాదయాత్ర అయినాక మీ దగ్గరకు వస్తాడు. ఆశీర్వదించండి..దీవించండి..కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇక్కడున్న కార్యకర్తలకు విజ్ఞప్తి. ఎవరూ భయపడొద్దు. 20 కేసులు నా మీద పెట్టారు. అటెంప్ట్‌ మర్డర్‌ ఉంది. ఎస్సీ, ఎస్టీ కేసుంది. కానీ తగ్గేదే లేదు’’ అని తెలియజేశారు. లోకేష్‌ ఇలా వ్యాఖ్యానించడంతో ధర్మవరం టీడీపీలో కొత్త జోష్‌ వచ్చింది.

బత్తలపల్లిలో జరిగిన సభలో లోకేష్‌ ప్రసంగం VIDEO 

ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ తరఫున పరిటాల శ్రీరాం పోటీలో ఉంటారా? లేదా? అన్న అనుమానాలు తొలగిపోయాయి. కష్టకాలంలో పార్టీకి, క్యాడర్‌కు అండగా ఉన్న శ్రీరాం వైపే టీడీపీ అధినేత చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ధర్మవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వరదాపురం సూరి.. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీని వీడి బీజేపీలో చేరారు. దీంతో నియోజకవర్గంలో డీలా పడిన తెలుగుదేశం పార్టీ క్యాడర్‌కు పరిటాల శ్రీరాం అండగా నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. త్వరలోనే వరదాపురం సూరి బీజేపీని వీడి టీడీపీలోకి చేరుతారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికల్లో పరిటాల శ్రీరాంకు ధర్మవరం నుంచి లైన్‌ క్లియర్‌ అయిందని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Manassakshi Epaper
Views:1289

About The Author

Related Posts

Latest News

ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి  ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
మనస్సాక్షి , పామిడి : పామిడి పంచాయతీ ఈవోగా విధులు నిర్వర్తించి గార్లదిన్నె మండలానికి బదిలీ అయిన చంద్రశేఖర్‌ను అనంతపురంలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేత, మాజీ...
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు
ఎంట్రీ పాస్‌ ఉంటేనే మద్యం లాటరీకి అనుమతి
బాబూ.. సంపద సృష్టి ఇదేనా?