మా నమ్మకం నువ్వే జగన్.. ఇది ప్రజల నినాదం
అనంతలో ‘జగనన్నే మా భవిష్యత్’ ప్రారంభం
మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి : ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనేది ప్రజల నినాదమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. అందుకే ‘జగనన్నే మా భవిష్యత్’ అని జనం అంటున్నారని చెప్పారు. శుక్రవారం నగరంలోని నవోదయ కాలనీలో ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ప్రజాప్రతినిధులతో పాటు వైసీపీ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో కలిసి పలు కుటుంబాలను నేరుగా కలిశారు.
చంద్రబాబు పాలనకు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు తేడాను వివరించి ప్రజల మద్దతు కోరారు. భవిష్యత్‌లోనూ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా ఉంటారా? సంక్షేమ పథకాలు అందుతున్న తీరు బాగుందా? ఇంకా ఏమైనా మార్పు చేయాలా? అని ప్రజల అభిప్రాయం తెలుసుకున్నారు. అంతకుముందు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అనంత మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 60 లక్షల కుటుంబాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు కలవడమే లక్ష్యంగా ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఈనెల 20వ తేదీ వరకు దాదాపు 14 రోజులు ప్రజలతో మమేకమవుతామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ల 10 నెలలుగా సీఎం జగన్ నాయకత్వంలో క్లిష్టపరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు అందజేశామన్నారు. ఎన్నికల సమయంలో జగన్ చేసిన వాగ్ధానాలను 98 శాతం అమలు చేసినట్లు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్నారు. ఎక్కడా అవినీతి, పక్షపాతం లేకుండా పథకాలు అందిస్తున్నామని, అందరికీ సంక్షేమం అందించిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. పరిపాలనలో నూతన సంస్కరణలు తెచ్చి ప్రజల వద్దకు పాలన చేరువ చేశామన్నారు. సచివాలయ వ్యవస్థ తెచ్చి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టామన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మూడేళ్ల 10 నెలల్లో రూ.2 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందజేసిన ఘనత తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదని అన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీని ఆదర్శంగా తీసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయన్నారు.
2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించలేదని చెప్పారు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని తెలిసి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. పేదల పక్షాన తమ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ తరం బాగుపడాలన్నా.. భవిష్యత్ తరాలకు ఉజ్వల భవిష్యత్ ఉండాలన్నా వైసీపీ అధికారంలో ఉండాలని, జగన్ సీఎంగా కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి క్లస్టర్ పరిధిలో రోజూ 10 నుంచి 15 కుటుంబాలను కలిసి ప్రజామద్దతు కోరనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ప్రజల సమ్మతితో ప్రతి ఇంటికీ స్టిక్లర్లు అందిస్తామన్నారు. వైసీపి జిల్లా అధ్యక్షుడు పైలా నర్సింహయ్య మాట్లాడుతూ పేదలకు ఏదైనా మంచి జరిగిందంటే అది జగన్ సీఎం అయిన తర్వాతేనని చెప్పారు. భవిష్యత్‌లో ఇంకా మంచి జరగాలంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.