అనంతపురం మెడికల్ కళాశాలలో హౌస్‌సర్జన్లకు ఎథిక్స్ సర్టిఫికెట్లు
మనస్సాక్షి, అనంతపురం : విలువలతో కూడిన వైద్యాన్ని ప్రజలకు అందించినప్పుడే మంచి మానవత్వపు వైద్యులుగా స్థిరపడే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ ఎస్ వి కే ప్రసాద్ రెడ్డి తెలిపారు.మెడికల్ కళాశాల లోని సెంట్రల్ హాల్లో ‘‘వైద్య వృత్తిలోని విలువలు’’ అన్న అంశంపై 2కే17 బ్యాచ్ హౌస్ సర్జన్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హౌస్ సర్జన్సీ కోర్స్ పూర్తిచేసుకుని డాక్టర్లుగా సమాజంలో సేవలు అందించబోతున్న వందమంది హౌస్ సర్జన్లకు ఎథిక్స్ సర్టిఫికెట్లను ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ ఎస్ వి కె ప్రసాద్ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి, అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ కే ఎల్ సుబ్రహ్మణ్యం, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ షారోన్ సోనియా తదితరులు అందించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ ఎన్ని కోట్లు సంపాదించామన్నది ముఖ్యం కాదని, ఎన్ని లక్షల మంది పేద ప్రజలకు మన వైద్యంతో జీవితాన్ని ప్రసాదించామన్నదే మనకు అత్యంత సంతృప్తి కలుగుతుందన్నారు. విలువలు పాటిస్తూ వైద్యం చేయకపోతే కఠిన చర్యలు కూడా నేషనల్ మెడికల్ కమిషన్ తీసుకుంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో 2కే 17 బ్యాచ్ హౌస్ సర్జన్లు, సూపర్ స్పెషాలిటీ న్యూరాలజిస్టు లు డాక్టర్ భాస్కర్, డాక్టర్ రవితేజ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, అకడమిక్ సిబ్బంది మస్తాన్ బాబా, వాణి తదితరులు పాల్గొన్నారు.