నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : నారా లోకేష్‌కు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సవాల్‌

On
నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : నారా లోకేష్‌కు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సవాల్‌

మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : నారా లోకేష్‌ ఓ దద్దమ్మ అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఫైర్‌ అయ్యారు. పంగల్‌ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్‌ వరకు చేపట్టిన అర్బన్‌ లింక్‌ వైడనింగ్‌ ప్రాజెక్ట్‌ను తెలుగుదేశం పార్టీ హయాంలోనే తెచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి చేసిన వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే అనంత తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మిడిమిడి జ్ఞానంతో వాళ్లు మాట్లాడిన మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని, కానీ వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. లోకేష్‌ అజ్ఞాని అని ఇన్నాళ్లూ అందరూ అంటుంటే ఏదో అనుకున్నానని, నిన్న బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యలు చూశాక లోకేష్‌ అజ్ఞానం తెలిసిందన్నారు. ఇతరుల మౌత్‌పీస్‌గా లోకేష్‌ ఉంటాడని నిరూపితమైందన్నారు. ప్రభుత్వంపైన, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మీద, తనపైన అవాకులు చవాకులు పేలారని.. లోకేష్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదన్నారు. పక్కనోళ్లు చెప్పినంత మాత్రాన ఏది వాస్తవమో తెలుసుకోకపోతే ఎలాగని ప్రశ్నించారు. యువగళం పాదయాత్ర పేరుతో ఏ నియోజకవర్గంలోకి వెళితే అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలపై బురదజల్లి వాళ్లే కడుక్కుంటారన్న ధోరణిలో లోకేష్‌ సాగుతున్నాడని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే అనంతపురం అభివృద్ధి చెందిందని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. 2014 నుంచి 2019 వరకు అనంతపురంలో ఏం జరిగిందో ఇక్కడి ప్రజలందరికీ తెలుసన్నారు. నిత్యం శాంతిభద్రతలకు విఘాతం కల్పించారని, ఇప్పుడు అనంతపురం ప్రశాంతంగా ఉందని చెప్పారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఎక్కడ, ఎవరి కొంప కొడతారోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి ఉండేదన్నారు. అర్బన్‌ లింక్‌ వైడనింగ్‌ ప్రాజెక్ట్‌ను మీరు తెచ్చిందే నిజమైతే 2015లో నేషనల్‌ హైవే పరిధిలో ఉన్న రోడ్డును ఎందుకు ఆర్‌అండ్‌బి పరిధిలోకి తెచ్చారని సూటిగా ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో, తనకున్న పరిచయాలతో ఆర్‌అండ్‌బి నుంచి నేషనల్‌ హైవేస్‌లోకి మార్చినట్లు స్పష్టం చేశారు. అర్బన్‌ లింక్‌ వైడనింగ్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం జగన్‌ స్వయంగా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారని తెలిపారు.  

మీ బతుకంతా వినతిపత్రాలకే పరిమితం

అనంతపురంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక.. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే సహించలేక మేం వినతిపత్రాలు ఇచ్చిన పనులే అవన్నీ అని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాళ్ల బతుకంతా వినతిపత్రాలు ఇవ్వడానికే సరిపోయిందని అన్నారు. అభివృద్ధి పనులు జరిగితే వ్యతిరేకించడం.. ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తాను, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.  

WhatsApp Image 2023-04-05 at 3.18.17 PM

మెంటల్‌ ఉందేమో వస్తే సూపర్‌స్పెషాలిటీలోనే చూపిస్తా

రాష్ట్ర విభజనలో ఒక అంశాన్ని పట్టుకుని అనంతపురంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తే ఈరోజుకీ దాన్ని ప్రారంభించకుండా కేవలం సాధారణ ప్రభుత్వ ఆస్పత్రిలాగా, కోవిడ్‌ సెంటర్‌లాగా మార్చారని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి వ్యాఖ్యానించడంపైనా ఎమ్మెల్యే అనంత ఘాటుగా స్పందించారు. 2013లో తాను ఎంపీగా ఉన్న సమయంలోనే ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై ఫేజ్‌ 3) కింద అనంతపురం మెడికల్‌ కళాశాల అప్‌గ్రేడ్‌లో భాగంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వచ్చిందని స్పష్టం చేశారు. కేవలం అనంతపురం మాత్రమే కాదని దేశవ్యాప్తంగా 39 మెడికల్‌ కళాశాలల అప్‌గ్రేడ్‌కు అప్పట్లో కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లలో కనీసం ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. వాళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు జరుగుతున్న అభివృద్ధికి తామే కారణమని చెప్పుకుంటున్నారని తెలిపారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి రాష్ట్ర వాటాగా రూ.30 కోట్లు చెల్లించాల్సి ఉంటే టీడీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి అయినా చెల్లించారా? అని ప్రశ్నించారు. ఆస్పత్రిని కోవిడ్‌కు మార్చిన మాట వాస్తవమేనని, దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను కోవిడ్‌ బాధితులకు వైద్యం అందించడం కోసం మార్చిన విషయం తెలియదా? అని ప్రశ్నించారు. కోవిడ్‌ సమయంలోనూ తాము ప్రజల్లోనే ఉన్నామని, వాళ్లలా ప్రాణభయంతో ఇంట్లో కూర్చోలేదని స్పష్టం చేశారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఇప్పుడు ఐదు విభాగాల్లో స్పెషలిస్ట్‌ వైద్యం అందిస్తున్నామని, వాళ్లకు మెంటల్‌ ఏమైనా ఉంటే సూపర్‌ స్పెషాలిటీలోని న్యూరాలజీ విభాగంలో మంచి డాక్టర్‌తో చికిత్స అందిస్తామని చురకలంటించారు. టీడీపీ హయాంలో అనంతపురంలో ప్రారంభించి..పూర్తి చేసిన ప్రాజెక్ట్‌ ఒక్కటుందా? అని ఎమ్మెల్యే అనంత ప్రశ్నించారు. వాళ్లలా మూడు కుంపట్లు పెట్టుకుని.. కేవలం డివైడర్లకే తాము పరిమితం కాలేదని స్పష్టం చేశారు. అనంతపురంలో అభివృద్ధి ఎలా జరుగుతోందో ప్రజలకు తెలుసని చెప్పారు.  

ఒక నంబర్‌ తక్కువ నొక్కితే.. ఎన్నికల్లో నాకే జనం ఎందుకు నొక్కారు?

అనంత వెంకటరామిరెడ్డి అంటే ఏమిటో నారా లోకేష్‌ తన తండ్రి చంద్రబాబును అడిగితే చెబుతారని ఎమ్మెల్యే అనంత సూచించారు. నాలుగు సార్లు ఎంపీగా, ఒక సారి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర తనదని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సింగిల్‌ ఎలక్షన్స్‌ (ఎంపీ ఎన్నికలు) జరిగితే  పరిటాల రవీంద్ర హవాలోనూ.. టీడీపీ అధికారంలో ఉన్నా తాను గెలుపొందానని తెలిపారు. నిజంగా తాను ఒక నంబర్‌ తక్కువ నొక్కుతుంటే.. ప్రజలు తనకు, తాను ప్రాతినిథ్యం వహించే పార్టీకే అన్ని ఎన్నికల్లోనూ ఎందుకు నొక్కారో తెలుసుకోవాలని చురకలంటించారు. ఒకసారి గెలిచి మరోసారి గెలవనోళ్లు కూడా మాట్లాడుతున్నారని, మంత్రిగా పనిచేసినా దద్దమ్మ అని తెలిసే లోకేష్‌ను మంగళగిరిలో ఓడించారని విమర్శించారు.

వైఎస్‌ఆర్‌ చలవతోనే అనంతకు కృష్ణా జలాలు

తాను ఎంపీగా ఉన్న సమయంలోనే రాయదుర్గం, తుమకూరు రైల్వే లైన్‌ వచ్చిందని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు.  ఆ తర్వాత టీడీపీ పాలనలో ఎంత పురోగతి సాధించారో వాళ్లే చెప్పాలన్నారు. హంద్రీనీవాకు  మూడు సార్లు శంకుస్థాపన చేయడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. 40 టీఎంసీలను 5 టీఎంసీలకు చేశారని, లోకేష్‌ పక్కనున్న దద్దమ్మలు ఏనాడూ అడిగిన పాపానపోలేదన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక 2005లో 40 టీఎంసీలకు చేశామని, ఆ తర్వాత 2012లో అప్పటి మంత్రి రఘువీరారెడ్డితో కలిసి పాదయాత్ర ద్వారా నీళ్లతో పాటు నడిచి జీడిపల్లికి చేర్చిన చరిత్ర తమదని తెలిపారు. రాజకీయాల్లో కమిట్‌మెంట్‌ ఉంది కాబట్టే ప్రజలు తమ కుటుంబాన్ని ఆదరిస్తున్నారని స్పష్టం చేశారు. మీరు దద్దమ్మలు.. ప్రజలకు మంచి చేయలేదు..యోగ్యత లేదు కాబట్టే ఇంట్లో కూర్చోబెట్టారని విమర్శించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపైన నమ్మకం ఉండబట్టే కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీకి ఒక్కసీటు రాలేదని.. అయినా సిగ్గూఎగ్గూ లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.  

లోకేష్‌.. నీ బంధువులతోనే ఆరా తీయ్‌..!

అనంతపురం నగరంలో కమీషన్లు తీసుకుంటున్నట్లు.. వ్యాపారులను బెదిరిస్తున్నట్లు లోకేష్‌ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనంత స్పందించారు. ‘‘లోకేష్‌ బంధువులే ఇక్కడ బార్లు కూడా నడుపుకుంటున్నారు. వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్లను అడిగితే వాస్తవాలు తెలుస్తాయి’’ అని తెలిపారు.  

మీ మాదిరి ఇంట్లో ఉండేవాణ్ణి కాదు..!

నారా లోకేష్‌ వ్యాఖ్యలన్నీ అక్కసుతో చేసినవేనని ఎమ్మెల్యే అనంత తెలిపారు. ‘‘నువ్వు ప్రజల్లోకి వస్తున్నావు. ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. నీ మాదిరి, నీ పార్టీ వాళ్ల మాదిరి నేను ఇంట్లో ఉండేవాణ్ణి కాదు. నిత్యం ప్రజల్లోనే ఉంటా. మేం అభివృద్ధి చేశాం కాబట్టే ప్రజలు మావైపు నిలుస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడిన ఘటనలు ఏవైనా ఉన్నాయా అంటే ఇది టీడీపీ హయాంలోనే. అప్పటి ఎంపీ, ఎమ్మెల్యేల తీరు వల్లే ఇబ్బంది పడ్డారు. నా నియోజకవర్గంలో ఒక్క కార్పొరేటర్‌ మీరు గెలవలేదు. ఎంపీటీసీలు గెలవలేదు. అది మీ చేతగానితం. దానికి కారణం మేం కాదు’’ అని చెప్పారు. 

అంత ఉబలాటం ఉంటే రాజీనామా చేయించు

తాను సుమారు 11 నెలలుగా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నానని, సీఎం జగన్‌ పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందని ఎమ్మెల్యే అనంత తెలిపారు. రాష్ట్రంలో ‘ఉన్న వాడు.. లేని వాడు’ అని ఉంటే నేను లేని వాడి పక్షానే నిలుస్తానని సీఎం జగన్‌ బహిరంగంగా ప్రకటించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. లోకేష్‌కు అంత ఉబలాటంగా ఉంటే హిందూపురంలో ఆయన ముద్దుల మామయ్యతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ విసిరారు. అప్పుడు ప్రజల అభిప్రాయం తెలుస్తుందన్నారు.

Manassakshi Epaper
Views:470

About The Author

Related Posts

Latest News

ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి  ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
మనస్సాక్షి , పామిడి : పామిడి పంచాయతీ ఈవోగా విధులు నిర్వర్తించి గార్లదిన్నె మండలానికి బదిలీ అయిన చంద్రశేఖర్‌ను అనంతపురంలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేత, మాజీ...
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు
ఎంట్రీ పాస్‌ ఉంటేనే మద్యం లాటరీకి అనుమతి
బాబూ.. సంపద సృష్టి ఇదేనా?