నిజం మాట్లాడితే తల వెయ్యిముక్కలు..!

నారా లోకేష్‌పై వైసీపీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి సెటైర్‌

On
నిజం మాట్లాడితే తల వెయ్యిముక్కలు..!

మనస్సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి సెటైర్‌ వేశారు. యువగళం పాదయాత్రలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేస్తూ లోకేష్‌ చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఆయన తండ్రి చంద్రబాబు చేసిన హితోపదేశం ఒకటుందంటూ ఎద్దేవా చేశారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఏమన్నారంటే.. ‘‘నారా లోకేష్‌ పాదయాత్ర ప్రారంభించే సమయంలో ఆయన తండ్రి చంద్రబాబు ఒక మాట చెప్పినాడంట.!  ఇన్నేళ్ల ముఖ్యమంత్రి కాలంలో ఏ రోజూ నేను నిజం చెప్పలేదు. నిజం చెబితే నా తల వెయ్యి ముక్కలవుతుందని శాపం ఉంది. నీక్కూడా అదే శాపం ఉంది. పొరపాటున కూడా నిజం మాట్లాడొద్దు అని చెప్పినాడంట. అందుకే లోకేష్‌ మిడిమిడి జ్ఞానంతో మా ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తున్నాడు’’ అని చెప్పారు. గళం ఉన్నోడు యువగళం అని పెట్టుకోవాలని, కానీ గళమే లేనోడు.. మంగళగిరికి, మందలగిరికి తేడా తెలీనోడు పాదయాత్ర చేస్తే ఎట్లుంటుందో నిన్న అనంతపురంలో చూశామని చింతా తెలిపారు. ‘‘ నారా లోకేష్‌ను మా మంత్రి రోజా గారు మాలోకం అని ఒక పేరుతో పిలుస్తారు. మా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు 23వ పులకేశి అని అంటారు.  తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వంశీ అయితే పప్పు అంటారు. పప్పు అని అంటే వాళ్ల నాయన, ఈయన, వాళ్ల మామ అందరూ కూలి పెట్టుకుని ఏడ్చే పరిస్థితి. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, వయసు తారతమ్యం లేకుండా ఏంది నోటికి వస్తే అది మాట్లాడితే ప్రజలు హర్షించరు. నారా లోకేష్‌ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదివానని అంటాడు. నీ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ స్టాండర్డ్‌ ఇదేనా? అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలలో లెక్చరర్‌గా పని చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఎస్కేయూలో ప్రొఫెసర్‌గా పని చేశారని అన్నావు’’ అని ఎద్దేవా చేశారు.

WhatsApp Image 2023-04-05 at 6.12.58 PM

కోవిడ్‌ సమయంలో ఈ నియోజకవర్గంలో కనిపించకుండా పోయిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరితో సహా టీడీపీ నాయకులు ఇన్నాళ్లూ ఏదైతే చెబుతున్నారో అదే లోకేష్‌ మాట్లాడారని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా రోడ్డు తీసుకొచ్చింది మేమే అని వాళ్లు రాసిస్తే చదివినాడు.. హాస్పిటల్‌ తెచ్చింది మేమే అని రాసిస్తే అది చదివినాడు అని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ లబ్ధి కలగలేదని అనడం లోకేష్‌ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని చెప్పారు. అనంతమైన అవినీతి ఇప్పుడు ఎక్కడా జరగలేదని..టీడీపీ హయాంలో అప్పటి ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, మేయర్‌ స్వరూప ఉన్నప్పుడే అనంతమైన అవినీతి చేసి అభివృద్ధిని విస్మరించినట్లు విమర్శించారు. ఇదే అనంతపురం నగర పాలక సంస్థ కార్యాలయంలో జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌ చౌదరి కొట్టుకునే స్థాయికి వెళ్లారని గుర్తు చేశారు. ఇప్పుడు టవర్‌ క్లాక్‌ వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ఎలా ఉంది? గతంలో తాము కట్టామని చెబుతున్న రాంనగర్‌ బ్రిడ్జి ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. రాంనగర్‌ బ్రిడ్జి ప్రారంభం సమయంలోనూ చెరో టెంకాయ కొట్టుకున్నారని.. జేసీ దివాకర్‌రెడ్డి బ్రిడ్జిని ఎలా ప్రారంభించారన్న చరిత్ర కళ్ల ముందే ఉందన్నారు. టీడీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం వల్లే 50 డివిజన్లకు గాను ఒక్కటి కూడా గెలవలేదన్నారు. అప్పట్లో టీడీపీ నాయకుల తీరు, దౌర్జన్యాలు ఎలా ఉండేవో అందరికీ తెలుసని అన్నారు. పిచ్చోడిని తీసుకొచ్చి నాలుగు పిచ్చిమాటలు మాట్లాడిస్తే ఇక్కడి ప్రజలు హర్షించరని వ్యాఖ్యానించారు. నగరంలో తాగునీటి సౌకర్యం కల్పించిన ఘనత అనంత వెంకటరామిరెడ్డిదని, దశాబ్ధకాలంగా నీటికి నోచుకోని చెరువుకు హంద్రీనీవా నీరు తెచ్చిన ఘనత కూడా ఆయనదేనని అన్నారు. నడిమివంక పనుల కోసం వెచ్చించాల్సిన నిధులను చెరువు కట్ట వద్దకు తరలించిన పాపం ఎవరిదని ప్రశ్నించారు. పాదయాత్రలో లోకేష్‌ పిచ్చి ప్రేలాపనలు మానాలని, అనంత వెంకటరామిరెడ్డి గురించి చంద్రబాబును అడిగితే తెలుస్తుందని సూచించారు. ‘‘ఉమ్మడి అనంతపురం జిల్లా ముద్దుల మామయ్య (బాలకృష్ణ)ను ఆదరించిందని చెబుతున్నావు సరే.. ముద్దుల తాతయ్య వెన్నుపోటు కథ ఏందో మీ నాయన చొక్కా పట్టుకుని అడుగు’’ అని ఘాటూగా విమర్శించారు. కోవిడ్‌ సమయంలో మీ పార్టీ నాయకులు భయపడి ఇళ్లలో ఉంటే ధైర్యంగా రోగుల వద్దకు వెళ్లిన నాయకుడు అనంత వెంకటరామిరెడ్డి అని స్పష్టం చేశారు. తాము అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల్లోనే ఉంటామని తెలియజేశారు. ఇంకోసారి పిచ్చికూతలు కూస్తే సమాధానం వేరేగా ఉంటుందని హెచ్చరించారు.

Manassakshi Epaper
Views:356

About The Author

Related Posts

Latest News

ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి  ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
మనస్సాక్షి , పామిడి : పామిడి పంచాయతీ ఈవోగా విధులు నిర్వర్తించి గార్లదిన్నె మండలానికి బదిలీ అయిన చంద్రశేఖర్‌ను అనంతపురంలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేత, మాజీ...
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు
ఎంట్రీ పాస్‌ ఉంటేనే మద్యం లాటరీకి అనుమతి
బాబూ.. సంపద సృష్టి ఇదేనా?