చంద్రబాబువి పగటికలలు
రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయం
మనస్సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు పగటికలలు కంటున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటామిరెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందని, కేవలం కేడర్‌ను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు తంటాలు పడుతున్నారని తెలిపారు. నగరంలోని 40వ డివిజన్‌లో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని వివరించారు. స్థానికంగా సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. సుమారు ఏడాది కాలంగా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల గడప వద్దకు వెళ్తున్నామని, జగన్ నాయకత్వం పట్ల ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు తోడు సచివాలయ వ్యవస్థ పనితీరు బాగుందని ప్రజలు చెబుతున్నారన్నారు. జనం సంతోషంగా ఉంటే చంద్రబాబు మాత్రం బాధపడుతున్నారని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. ప్రజల సంక్షేమం కోసం చేసిందేమీ లేదన్నారు. అందుకే ఇప్పుడు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం రాదన్న ఫ్రస్టేషన్‌లో సీఎం జగన్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏకంగా రూ.2 లక్షల కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. చంద్రబాబుకు ప్రజా సంక్షేమం పట్ల విజన్ లేదని, కేవలం అధికారంలోకి రావడం మాత్రమే ఆయన విజన్ అన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమని తెలిసి పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. జగన్ సంక్షేమ పథకాలు ఇస్తూ రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నారని అంటూనే తాను అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం అందిస్తామని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు చంద్రబాబు ఎప్పుడూ వ్యతిరేకమేనని అన్నారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తామంటే అవహేళన చేశారని గుర్తు చేశారు. చరిత్రలో ఎవరూ చేయని విధంగా అన్ని వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తిగా వైఎస్ జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ప్రజల్లో వైసీపీకి ఆదరణ పెరిగిందని, మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ ఫయాజ్, జేసీఎస్ కన్వీనర్లు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, చింతకుంట మధు, కార్పొరేషన్ల డైరెక్టర్లు గౌస్‌బేగ్, శ్రీనివాసులు, వైసీపీ బీసీ విభాగం రీజనల్ కో ఆర్డినేటర్ రమేష్‌గౌడ్, వైసీపీ నాయకులు ఖాదర్, షరీఫ్, సందీప్, ఇసాక్, నల్లప్ప, గుజ్జల లక్ష్మణ్, గౌతమి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.