రాయదుర్గం-ఉరవకొండ బస్సు సర్వీసులు ప్రారంభం
మనస్సాక్షి, కణేకల్లు: కణేకల్లు-మాల్యం గ్రామాల మధ్య వేదవతి నదిలో కొట్టుకుపోయిన రోడ్డుకు మరమ్మతులు చేసినందుకు రాయదుర్గం నుంచి ఉరవకొండకు బస్సు సర్వీసులు ప్రారంభించారు. వేదావతి నదిలో వేసిన మట్టి రోడ్డు కొన్ని నెలల క్రితం వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో కణేకల్లు మీదుగా ఉరవకొండకు వెళ్లాల్సిన బస్సు సర్వీసులు కణేకల్లు వరకే పరిమితమైయ్యాయి. ఉరవకొండ డిపోకు చెందిన బస్సులు కణేకల్లు మీదుగా రాయదుర్గం వెళ్లాల్సి ఉండగా మాల్యం వరకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు పడుతున్న కష్టాలను గ్రామస్తులు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే స్పందించి కణేకల్లు మండల టీడీపీ నాయకులకు రోడ్డుకు మరమ్మతులకు ఆదేశించారు. టీడీపీ నాయకులు సొంత నిధులతో చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులు పూర్తి కావడంతో ఆదివారం నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు ప్రయాణికులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.