పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్ క్యాంప్
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్ క్యాంప్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్ చెకప్ చేయాలని, ఆ క్యాంపులకు ఎంతమంది వచ్చారు అనేది రిపోర్టు ఇవ్వాలన్నారు. మాన్యువల్ స్కావెంజర్స్ చట్టం అమలు పకడ్బందీగా చేయాలని తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాన్యువల్ స్కావెంజర్స్ వ్యవస్థ నిర్మూలనపై మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, సంబంధిత అధికారులతో జిల్లా విజిలెన్స్ కమిటీ (మాన్యువల్ స్కావెంజర్స్ చట్టం - 2013) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యాన్ హోల్‌లో మనుషులను దింపుతున్నారని, ఇంతకుముందు అలా చేసిన అధికారులపై విచారణ చేసి షోకాజ్ నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని తాడిపత్రి మున్సిపల్ కమిషనర్‌ని కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పారిశుద్ధ కార్మికులకు అన్ని మున్సిపాలిటీలలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్నారు. జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్లతో వాట్సప్ గ్రూప్ తయారు చేయాలని, అందులో అన్ని రకాల సమాచారం అందించాలన్నారు. జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహణ గురించి ప్రజా ప్రతినిధులతో మాట్లాడి సమాచారం ఇవ్వాలన్నారు.
పారిశుద్ధ కార్మికులకు బట్టలు, సబ్బులు, రేడియో జాకెట్, బ్లౌజులు, యూనిఫామ్, తదితర అన్ని రకాల పరికరాలు అందించడంతోపాటు వాటిని రోజు ఉపయోగించేలా చూడాలన్నారు. మున్సిపాలిటీల్లో ఎంతమంది కార్మికులు ఉన్నారు? ఎన్ని పరికరాలు అవసరమవుతాయి? ఇప్పటివరకు ఎన్ని అందించారు? అనేదానిపై నివేదిక అందించాలన్నారు. కార్మికులకు సక్రమంగా జీతాలు ఇవ్వాలన్నారు. స్వయం సహాయక సంఘాలలో సఫాయి కర్మచారులు ఉన్నారని, వారికి ప్రాధాన్యత ఇచ్చి రుణాలు, శిక్షణ అందించేలా చూడాలని మున్సిపల్ కమిషనర్, ఎల్డిఎంలను ఆదేశించారు. గతంలో మాన్యువల్ స్కావెంజర్స్ గా పనిచేసిన వారికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సాయం అందించారో నివేదిక అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా మాన్యువల్ స్కావెంజర్స్ పనిచేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే ధ్రువీకరణ చేయాలని ఆదేశించారు. సమావేశంలో సోషల్ వెల్ఫేర్ జెడి రాధిక, నగర పాలక సంస్థ కమిషనర్ బాలరాజు, డ్వామా పిడి సలీమ్ బాషా, హౌసింగ్ పిడి శైలజ, ఎల్డిఎం నర్సింగరావు, పీఆర్ ఎస్‌ఈ జహీర్ అస్లాం, బిసి కార్పొరేషన్ ఈడి సుబ్రమణ్యం, డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు, డీఎంహెచ్‌ఓ డా.ఈబి.దేవి, మెంబర్లు పెన్నోబుళేసు, వినోద్ కుమార్, రియాజ్ భాష, పద్మావతి, మున్సిపల్ కమిషనర్‌లు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.